జర్మనీలో మినీ మహానాడు ఘనంగా జరగడం ప్రవాసాంధ్రుల రాజకీయ, సాంస్కృతిక అనుబంధాన్ని మరోసారి చూపించింది. జర్మనీ నుంచే కాకుండా ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి కూడా ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, గళ్లా రామచంద్ర రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నారై తెదేపా జర్మనీ విభాగానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను గళ్లా మాధవి ఆవిష్కరించారు. మహిళలకు రాబోయే ఎన్నికల్లో ముప్పై మూడు శాతం సీట్లు కేటాయించే నిర్ణయం చారిత్రాత్మకమని వక్తలు అభినందించారు.
గళ్లా మాధవి మాట్లాడుతూ, ఎల్లలు దాటినా మాతృభూమి, తెలుగుదేశం పార్టీని ప్రవాసాంధ్రులు గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. జర్మనీలో మహానాడు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం తన అదృష్టమని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబం కంటే ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని, తెలుగు నేలపై ఆయన చెరగని చిరునామా అని గుర్తుచేశారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని అన్నారు. గళ్లా రామచంద్ర రావు ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సభలో జై తెదేపా, ఎన్టీఆర్ అమర్ రహే, జై చంద్రబాబు, జై లోకేష్ నినాదాలు మార్మోగాయి.
కార్యక్రమంలో నలభై ఆరు రకాల ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రవాసాంధ్రులను అలరించాయి. పెద్ద సంఖ్యలో నాయకులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొనడంతో జర్మనీ మినీ మహానాడు ప్రవాస తెలుగు రాజకీయ ఉత్సాహానికి గుర్తుగా నిలిచింది.
జర్మనీలో మినీ మహానాడుకు ప్రవాసాంధ్రుల సందడి
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan